అర్జున్‌ రెడ్డి సినిమా తరువాత టాలీవుడ్‌లో బోల్డ్ సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు ముందుకు వస్తున్నారు. అదే జానర్‌లో తెరకెక్కిన సినిమా ఆర్‌ఎక్స్‌ 100. సినిమా టైటిల్‌ తో పాటు పోస్టర్స్‌, టీజర్స్‌ డిఫరెంట్‌గా ఉండటంతో సినిమా మీద భారీ హైప్‌ క్రియేట్ అయ్యింది. అందుకు తగ్గట్టుగా చిత్రయూనిట్‌ రొటీన్‌ సినిమాలు చూడాలనుకునేవారు మా సినిమాకు రావొద్దంటూ ధైర్యంగా స్టేట్‌మెంట్‌ ఇవ్వటంతో సినిమా మీద అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. రామ్‌ గోపాల్ వర్మ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన అజయ్‌ భూపతి దర్శకుడిగా కార్తికేయ, పాయల్‌ రాజ్‌పుత్‌లను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఆర్‌ఎక్స్‌ 100 అంచనాలు అందుకుందా..? రొటిన్‌ సినిమాలకు భిన్నంగా ప్రేక్షకులను ఆకట్టుకుందా.?

కథ ;
చిన్నప్పుడే అమ్మానాన్నలను కోల్పోయిన శివ(కార్తికేయ)ను డాడీ(రాంకీ) అన్ని తానే అయి పెంచుతాడు. డాడీకి చేదోడు వాదోడుగా ఉంటూ సరదాగా కాలం గడిపేస్తుంటాడు శివ. ఊళ్లో గొడవల కారణంగా డాడీకి , విశ్వనాథం(రావు రమేష్)తో గొడవలు అవుతాయి. కానీ అదే సమయంలో శివ, విశ్వనాథం కూతురు ఇందు(పాయల్ రాజ్‌పుత్‌)తో ప్రేమ పడతాడు. (సాక్షి రివ్యూస్‌) తన ప్రేమకు డాడీ సపోర్ట్ చేయటంతో శివ, ఇందుకు మరింత దగ్గరవుతాడు. ఒక రోజు మన ప్రేమ విషయం ఇంట్లో చెప్తానని శివకు చెప్పి వెళ్లిన ఇందు, తండ్రి చూసిన ఫారిన్ కుర్రాడిని పెళ్లి చేసుకొని వెళ్లిపోతుంది. ఇందును తన నుంచి దూరం చేశాడని విశ్వనాథం మీద పగ పెంచుకుంటాడు శివ. విశ్వనాథం మనుషులను కొట్టడంతో పాటు, ఆస్తులను కూడా ధ్వంసం చేస్తూ సైకోలా తయారవుతాడు. అసలు ఇందు, శివను కాదని మరో పెళ్లి ఎందుకు చేసుకుంది..? వీరి ప్రేమకథలో విలన్‌ ఎవరు..? చివరకు శివ ఏమైయ్యాడు అన్నదే మిగతా కథ

నటీనటులు ;
ప్రమోషన్‌ల సమయంలోనే ఈ పాత్రను చాలెంజ్‌గా తీసుకొని చేశానంటూ చెప్పిన కార్తికేయ, శివ పాత్రకు న్యాయం చేసేందుకు సిన్సియర్‌గా ప్రయత్నించాడు. నాచురల్‌ లుక్‌లో రియలిస్టిక్‌గా కనిపించాడు. నిజాయితీ గల ప్రేమికుడిగా, ప్రేమకు దూరమై మూర్ఖుడిలా మారిన యువకుడిలా రెండు వేరియన్స్‌ బాగా చూపించాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌ సీన్‌లో కార్తికేయ నటన ఆకట్టుకుంటుంది. హీరోయిన్‌గా పాయల్ రాజ్‌పుత్‌ పరవాలేదనిపించింది. నటన పరంగా ఓకె అనిపించినా, గ్లామర్‌ షో, బోల్డ్‌ సీన్స్‌తో ఆడియన్స్‌కు షాక్‌ ఇచ్చింది.(సాక్షి రివ్యూస్‌) రావు రమేష్ మరోసారి తనదైన నటనతో మెప్పించారు. చాలా కాలం తరువాత తెలుగు తెర మీద కనిపించిన రాంకీ నిరాశ పరిచారు. హీరోకు పెద్ద దిక్కుగా కనిపించిన రాంకీకి ఒకటి రెండు సన్నివేశాల్లో తప్ప పెద్దగా నటనకు అవకాశం దక్కలేదు.

విశ్లేషణ ;
దర్శకుడు అజయ్‌ భూపతి.. అర్జున్‌ రెడ్డి సినిమాను దృష్టిలో పెట్టుకొని అలాంటి బోల్డ్‌ సినిమాను తెరకెక్కించేందుకు ప్రయత్నించాడు. అయితే తను అనుకున్న కథను ఆసక్తికరంగా తెరకెక్కించటంలో మాత్రం ఫెయిల్‌ అయ్యాడు. ఆర్‌ఎక్స్‌ 100 టైటిల్‌ కోసం ఎంతో కష్టపడి సాధించానని చెప్పిన దర్శకుడు అసలు ఆ టైటిల్‌ ఎందుకు పెట్టాడో అర్థం కాలేదు. కేవలం హీరో ఆర్‌ఎక్స్‌ 100 బండి వాడటం తప్ప కథతో టైటిల్‌కు ఏ మాత్రం సంబంధం లేదు. లవ్‌ ట్రాక్‌ కూడా ఆసక్తికరంగా లేదు. (సాక్షి రివ్యూస్‌) హీరో హీరోయిన్‌ల మధ్య ప్రేమను చూపించే కన్నా సినిమాను బోల్డ్‌ గా తెరకెక్కించాలన్న ప్రయత్నమే ఎక్కువగా కనిపించింది. రొటీన్‌ ప్రేమకథలకు భిన్నంగా తెరకెక్కించే ఆలోచనతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను పక్కన పెట్టేశారు. కథనంలో వేగం లోపించటం కూడా ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. చైతన్య భరద్వాజ్‌ సంగీతమందించిన పాటలు పరవాలేదనిపిస్తాయి. స్మరన్‌ అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకునేలా లేదు. సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటింగ్‌ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. చాలా సందర్భాల్లో కథకు అవసరం లేని సన్నివేశాలు వచ్చిపోవటం ఇబ్బంది పెడుతుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్‌ ;
హీరో పాత్ర
కొన్ని ఎమోషనల్‌ సీన్స్‌

మైనస్‌ పాయింట్స్‌;
స్లో నేరేషన్‌
హీరో హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ సీన్స్‌