టైటిల్ : 16 (ఎవ్రీ డిటైల్ కౌంట్స్)
జానర్ : క్రైం థ్రిల్లర్
తారాగణం : రెహమాన్, ప్రకాష్ విజయ రాఘవన్, అశ్విన్ కుమార్, అంజనా జయప్రకాష్..
సంగీతం : జేక్స్ బిజోయ్
దర్శకత్వం : కార్తీక్ నరేన్
నిర్మాత : చదలవాడ పద్మావతి

కొత్త తరహా కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న యువతరం దర్శకులకు మంచి ఆదరణ లభిస్తుంది. అదే బాటలో క్రైం థ్రిల్లర్ గా తెరకెక్కిన ధృవంగల్ పతినారు సినిమాతో తమిళ ఆడియన్స్ మెప్పు పొందిన దర్శకుడు కార్తీక నరేన్. అదే సినిమాను ఇప్పుడు 16 ఎవ్రీ డీటెయిల్ కౌంట్స్ పేరుతో తెలుగులో రిలీజ్ చేశారు. తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న రెహమాన్ ప్రధాన పాత్రలో నటించిన 16 తెలుగు ఆడియన్స్ ను ఎంత వరకు ఆకట్టుకుంది..?

కథ :

దీపక్ (రెహమాన్) ఓ రిటైర్డ్ పోలీస్ అధికారిగా పరిచయం అవుతాడు. పోలీస్ ఆఫీసర్ కావాలని ఆశపడే ఓ యువకుడు.. దీపక్ అనుభవాలు, సలహాలు తెలుసుకోవాలనుకుంటాడు. కానీ అప్పటికే ఓ కేసు వల్ల తన కాలు కోల్పోయిన దీపక్, పోలీసు ఉద్యోగంలో చేరవద్దని సలహా ఇస్తాడు. 5 ఏళ్ల క్రితం తాను డీల్ చేసిన కేసు విషయాలను ఆ యువకుడికి వివరించటం మొదలు పెడతాడు.

ముందుగా ఓ వ్యక్తి రోడ్డు మీద తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడన్న కేసు దీపక్ దృష్టికి వస్తోంది. ఆ కేసు వివరాలు తెలుసుకుంటుండగానే, ఓ అపార్ట్ మెంట్ లో అమ్మాయి మిస్ అయ్యిందన్న మరో కేసు డీల్ చేయాల్సి వస్తుంది. మిస్ అయినా అమ్మాయి రూంలో గోడ మీద ఉన్న రక్తపు మరకలు తప్ప ఎలాంటి ఆధారం దొరకదు. అదే సమయంలో ఆత్మహత్య చేసుకున్న అబ్బాయి ఎవరు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అన్న వివరాలు కూడా దొరకవు. మిస్టరీగా మారిన ఈ రెండు కేసులను దీపక్ ఎలా పరీక్షించాడు..? అసలు ఈ రెండు వేరు వేరే కేసులా..లేక ఒకే కేసా..? ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో దీపక్ కు ప్రమాదం ఎలా జరిగింది..? చిరవకు ఆ కేసు ఏం అయ్యింది..? అన్నదే మిగతా కథ.

నటీనటులు :

సినిమా అంతా కేసు ఇన్వెస్టిగేట్ చేసే పోలీస్ ఆఫీసర్ దీపక్ చుట్టూనే తిరుగుతోంది. తెలుగు వారికి సహాయ నటుడిగా మాత్రమే పరిచయం అయినా రెహమాన్ ఫుల్ లెంగ్త్ రోల్ లోనే ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఓ క్రైం థ్రిల్లర్ సినిమాకు కావాల్సిన ఎమోషన్ ను అద్భుతంగా పలికించాడు. కానిస్టేబుల్ పాత్రలో కనిపించిన ప్రకాష్ విజయ రాఘవన్ ఆకట్టుకున్నాడు. మిగిలిన పాత్రలకు పెద్దగా స్క్రీన్ ప్రెజెన్స్ లేకపోవటం, ఆ పాత్రలో కనిపించిన వారు తెలుగు వారికి పరిచయం ఉన్న నటులు కాకపోవటంతో పాత్ర పరంగా ఓకె అనిపించారు.

సాంకేతిక నిపుణులు :

ఓ పర్ఫెక్ట్ థ్రిల్లర్ సినిమాను కేవలం 28 రోజుల్లో పూర్తి చేసిన దర్శకుడు కార్తీక్ నరేన్, కథా కథనాల మీద తనకున్న పట్టు చూపించాడు. ముఖ్యంగా తొలి భాగం అంతా ఇన్వెస్టిగేషన్ సమయంలో పోలీసులు కేసుల ఎలా విశ్లేషిస్తారో చూపించిన దర్శకుడు, రెండో భాగంలో ప్రతీ ప్రశ్నకు సమాధానం చెపుతూ వచ్చాడు. ముఖ్యంగా క్లైమాక్స్ తీర్చిదిద్దిన తీరు సినిమా స్థాయిని పెంచింది. జేక్స్ బిజోయ్ అందించిన నేపథ్య సంగీతం థ్రిల్లర్ సినిమాకు కావాల్సిన మూడ్ ను పర్ఫెక్ట్ గా క్యారీ చేసింది. సినిమా సక్సెస్ లో కీ రోల్ ప్లే చేసిన మరో అంశం శ్రీజిత్ సారంగ్ ఎడిటింగ్. టిపికల్ స్క్రీన్ ప్లేతో తెరకెక్కిన ఈ సినిమాను ఎలాంటి కన్య్ఫూజన్ లేకుండా సాధారణ ప్రేక్షకుడికి కూడా అర్ధమయ్యేలా ఎడిట్ చేశాడు శ్రీజిత్. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలతో పాటు, తెలుగు డబ్బింగ్ కూడా సినిమా స్థాయి తగ్గట్టుగా ఉన్నాయి.