తోపుడు బండిపైన అమ్మే చాట్‌ తిని 14 ఏళ్ల బాలిక మృతి చెందగా, 27 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖేరి జిల్లాలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. అస్వస్థతకు గురైన వారిలో ఎక్కువ మంది చిన్నారులు ఉండగా, వీరిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సోమవారం సాయంత్రం 27 మంది తోపుడు బండి మీద అమ్మిన స్నాక్స్‌ తిన్నారని, తర్వాత వీరిలో ఓ బాలిక మృతి చెందిందని పోలీసులు పేర్కొన్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, విషపూరిత ఆహారం తీసుకోవడంతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారన్నారు. రిపోర్ట్స్‌ ఆధారంగా చాట్‌ అమ్మకదారుడిపై కేసు నమోదు చేసి చర్య తీసుకుంటున్నట్లు తెలిపారు. చాట్‌ తిన్న వెంటనే అందరూ కడుపునొప్పితో బాధపడుతూ వాంతులు చేసుకున్నారని, దీంతో అర్థరాత్రి వీరందరినీ ఆసుపత్రికి తరలించారని పోలీసులు పేర్కొన్నారు.
తోపుడు బండి మీద చాట్‌ తిన్న పూనమ్‌ అనే 14 ఏళ్ల బాలికను కూడా దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు చికిత్స అందించి.. ఇంటికి పంపారన్నారు. ఇంటికి చేరుకున్న వెంటనే పరిస్థితి విషమించి బాలిక మృతి చెందిందని పోలీసులు తెలిపారు. మంగళవారం ఉదయం చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ జావేద్‌ అహ్మద్‌ గ్రామానికి వైద్య బృందాన్ని పంపి వైద్యం ఇప్పించారు. మరో రెండు రోజులు వైద్య సేవలు కొనసాగుతాయని చెప్పారు.
అయితే తన కుమార్తె చాట్‌ తినడం వల్లే మృతి చెందలేదని బాధితురాలి తండ్రి కిషోరీ లాల్‌ అంటున్నారు. చాట్‌ తినని చిన్నారులు కూడా అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. గ్రామంలో తీవ్రమైన అనారోగ్య సమస్య ఉందని, అధికారులు దీన్ని పట్టించుకోవడం లేదని చెప్పారు. ఈ సమాచారం అందుకున్న అధికారులు గ్రామాన్ని సందర్శించారు.