అమెరికా టెక్‌ జెయింట్‌ ఐబీఎం కూడా అధ్యక్షుడు ట్రంప్‌ దెబ్బకు హడలిపోయింది. ప్రచారం సందర్భంగా ఐబీఎం పేరుతోనే ట్రంప్‌ నేరుగా హెచ్చరికలు జారీ చేయడంతో ఆ సంస్థ వెంటనే ఉద్యోగాల్లో కోత మొదలుపెట్టింది. నవంబర్‌ నాటికి భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది. ఈ సంఖ్య వేలల్లోనే ఉంటుందని కంపెనీ అంతర్గత వర్గాలు అంటున్నాయి. దీనికి తోడు అప్పట్లో జరిగిన ఓ టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్‌ల సమావేశంలో ఐబీఎం సీఈవో గిన్నీ రొమెట్టీ 25,000 మంది అమెరికన్లను ఉద్యోగాల్లోకి తీసుకుంటానని ప్రతిజ్ఞ చేశారు. అంతేకాకుండా వచ్చే నాలుగేళ్లలో వారికి బిలియన్‌ డాలర్ల వ్యయంతో శిక్షణ కూడా ఇప్పిస్తానని తెలిపారు. దీనిలో భాగంగా గత నవంబర్‌ చివర్లో ఐబీఎం మూడో రౌండ్‌ ఉద్యోగాల తొలగింపును కూడా పూర్తి చేసింది. కానీ ఆ సంఖ్యను మాత్రం ఇప్పటికీ బయటకు చెప్పటంలేదు. వీటిల్లో ఎక్కువగా తూర్పు యూరోప్‌, ఆసియా తరలించినవి కూడా ఉన్నాయి. తొలగింపులు కొత్త సంవత్సరంలో కూడా కొనసాగే అవకాశం ఉంది.. కానీ వేగం మాత్రం కొంచెం తగ్గవచ్చు. దీనిని కంపెనీ అంతర్గతంగా రిసోర్స్‌ యాక్షన్‌గా వ్యవహరిస్తోంది. ఈ నెల ఐబీఎం అమెరికా నుంచి వెళ్లిపోవాల్సిన ఉద్యోగులపై దృష్టిపెట్టిందని ఆ సంస్థలోని ఓ ఉద్యోగి అంటున్నారు.