హైదరాబాద్‌: ఒకే కార్డుతో బస్సు, ఎంఎంటీఎస్‌, మెట్రో రైలుతోపాటు సెట్విన్‌, ఓలా, ఉబర్‌లోనూ ప్రయాణించేందుకు ఆర్టీసీ కసరత్తు మొదలుపెట్టింది. ప్రయాణికులకు మరింత మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడంలో భాగంగా కాంబినేషన్‌ కార్డును అందుబాటులోకి తెచ్చేందుకు టాస్క్‌ఫోర్స్‌ కమిటీని ఏర్పాటుచేసింది. రెండు నెలల్లో అన్ని విభాగాల అధికారులతో చర్చించి కామన్‌ కార్డు విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని టీఎస్‌ ఆర్టీసీ ఇన్‌చార్జి మేనేజింగ్‌ డైరెక్టర్‌ సునీల్‌శర్మ తెలిపారు. నగరంలో ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేసేందుకు కాంబినేషన్‌ టికెట్‌ దోహదపడుతుందని అధికారులు చెబుతున్నారు. మెట్రో, ఆర్టీసీ, ఎంఎంటీఎస్‌ కాంబినేషన్‌లో గతంలో ఉమ్మడి కార్డు అందుబాటులోకి తీసుకురావాలని భావించినా పలు కారణాలతో పక్కన పెట్టేశారు. ఇప్పడు అలాంటి పరిస్థితులు తలెత్తుకుండా టాస్క్‌ఫోర్స్‌ కమిటీ అధ్వర్యంలో సమావేశాలు నిర్వహించనున్నారు. సెట్విన్‌, ఓలా, ఉబర్‌ సంస్థలతోనూ చర్చలు జరిపి ఉమ్మడి కొత్త విధానాన్ని అమలుచేస్తే సొంత వాహనాల వినియోగం కొంత తగ్గే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
ప్రత్యేకంగా యాప్‌…
ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపర్చడంలో భాగంగా ఆర్టీసీ, ఎంఎంటీఎస్‌, మెట్రో సర్వీసుల సమయపాలన వివరాలు ప్రయాణికులకు తెలిపేలా ప్రత్యేకంగా ఒక యాప్‌ను కూడా తీసుకురావాలని ఆర్టీసీ భావిస్తోంది. దాంతో బస్సులో వెళ్లే ప్రయాణికులు ఎంఎంటీఎస్‌, మెట్రోలో ప్రయాణించేలా స్టేషన్‌ వద్ద ఏ సమయానికి బస్సు అందుబాటులో ఉంటుంది, ఎన్ని నిమిషాల్లో ఏ నెంబర్‌ స్టాప్‌ వద్దకు చేరుకుంటుందో ముందే తెలియనుంది. ఉమ్మడి సర్వీసుల వివరాలు ఒకే యాప్‌లో పొందుపరిస్తే మూడింట్లో ప్రయాణికుల సంఖ్య పెరిగేం అవకాశముందని అధికారులు పేర్కొంటున్నారు.
కార్డు రీచార్జ్‌తో ప్రయాణం…
ఒకే కార్డు విధానం అందుబాటులోకి వచ్చినా చార్జీల్లో మాత్రం మార్పులు ఉండబోవని అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి కార్డు రీచార్జ్‌ చేసుకున్నా బస్సులో ప్రయాణిస్తే దానికి సంబంధించిన చార్జి ఆర్టీసీ ఖాతాలోకి, ఎంఎంటీఎస్‌లో ప్రయాణిస్తే ఎంఎంటీఎస్‌ ఖాతాలో, మెట్రోరైల్‌లో ప్రయాణిస్తే మెట్రో ఖాతాలోకి వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు. కార్డు ధరలు నెలరోజుల్లో ప్రకటించే అవకాశాలున్నట్లు సమాచారం.