బాలీవుడ్‌, టాలీవుడ్‌ ఇలా అన్ని భాషా చిత్రాల్లో ప్రస్తుతం బయోపిక్‌ల హవా కొనసాగుతుంది. తెలుగులో ప్రస్తుతం అరడజనుకు పైగా బయోపిక్‌ చిత్రాలు తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. బాలీవుడ్‌లో తాజాగా సంజయ్‌ దత్‌ బయోపిక్‌ చిత్రం ‘సంజు’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంజు కేవలం మొదటి వారం రోజుల్లోనే ఏకంగా 250 కోట్లను వసూళ్లు చేసింది. లాంగ్‌ రన్‌లో ఈ చిత్రం 350 నుండి 400 కోట్ల వరకు వసూళ్లు సాధిస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది. బాలీవుడ్‌లో సంజు సూపర్‌ హిట్‌ అయిన నేపథ్యంలో పలు బయోపిక్‌లు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని కనిపిస్తుంది. ప్రముఖ లేడీ క్రికెటర్‌, టీం ఇండియా మహిళ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ బయోపిక్‌కు రంగం సిద్దం అవుతుంది.

 

క్రికెట్‌ అంటే ఇష్టంతో మిథాలీ రాజ్‌ చిన్నతనంలోనే బ్యాట్‌ను పట్టింది. ఎన్నో అవమానాలు, ఎన్నో భయానక పరిస్థితులను ఎదుర్కొన్న మిథాలీ రాజ్‌ తాజాగా ప్రపంచ మహిళ క్రికెటర్స్‌లో అత్యున్నత స్థానంలో ఉంది. ఆమె రికార్డులు మాములు రికార్డులు కాదు. అత్యధిక పరుగులు సాధించిన అమ్మాయి అవ్వడంతో పాటు, అత్యధికంగా మ్యాచ్‌లకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించి మిథాలీ రాజ్‌ రికార్డును దక్కించుకుంది. ఇండియాలో మహిళ క్రికెట్‌కు ఆధరణ దక్కడానికి కారణం మిథాలీ రాజ్‌ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అందుకే ఆమె బయోపిక్‌కు అర్హురాలు అంటూ సినీ వర్గాల వారు చెబుతున్నారు. పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు మిథాలీ రాజ్‌ బయోబ్రఫీని తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తన బయోపిక్‌ను ప్రియాంక చోప్రా చేస్తేనే బాగుంటుందని, ఆమె అభిరుచి, తన అభిరుచులు దగ్గరగా ఉంటాయని, తన గురించి ఆమెకు పూర్తిగా తెలుసు కనుక ప్రియాంక చోప్రా చేస్తేనే నా బయోపిక్‌ బాగుంటుందనే అభిప్రాయంను మిథాలీరాజ్‌ వ్యక్తం చేసింది. మరి ప్రియాంక చోప్రా ఈ ప్రతిపాధనకు ఎలా రియాక్ట్‌ అవుతుందో చూడాలి.