నూజివీడు: నూజివీడు ఏఎంసీ పదవి భర్తీ విషయంలో ఏర్పడిన విభేదాలపై ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ నేతలు స్పందించారు. జిల్లా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు బుధవారం నూజివీడు ఇన్‌చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు ఫోన్‌చేసి మాట్లాడారు. ‘ఈరోజు కేంద్రమంత్రి గడ్కరీ పోలవరం ప్రాజెక్టు దగ్గరకు వస్తున్న దృష్ట్యా అందరం బిజీగా ఉన్నాం, రేపు ఈ వివాదంపై మాట్లాడదాం..’ అని చెప్పారని ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. తన ఒక్కడితోనే కాదని, సమన్వయ కమిటీతో సహా సంప్రదించాల్సిన పరిస్థితిని కొందరు నాయకులు తెచ్చారని ఆయన మంత్రి దృష్టికి తీసుకెళ్లారని పేర్కొన్నారు. ఏఎంసీ ఎంపిక నిర్ణయం తమకు తెలియదని మంత్రులు పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావులు తనతో అన్నారని ముద్దరబోయిన పేర్కొన్నారు.
జీవో ఎలా వచ్చింది?
ఈ వ్యవహారాన్ని మొదటి నుంచి చూస్తున్న మంత్రులు పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమాలకు తెలియకుండా జీవో ఎలా జారీ అయింది? అనేది సమాధానం లేని ప్రశ్న. గతంలో ముద్దరబోయినను పిలిచి ఏఎంసీ ఎంపికపై చర్చించిన ఒక ఉన్నతాధికారి, రాష్ట్ర పార్టీ కార్యాలయంలో చక్రంతిప్పే ఒక ముఖ్య నాయకుడి వల్లే ఈ జీవో మంత్రులకు తెలియకుండా జారీ అయ్యిందనే ప్రచారం ముద్దరబోయిన వర్గీయుల నుంచి వినిపిస్తోంది. మంత్రులు ఇద్దరు ఈ ఎంపిక మాకు తెలియదని చెప్పడాన్ని బట్టే పై ప్రచారంలో నిజం ఉందేమోనని పలువురు భావిస్తున్నారు. సీఎం చంద్రబాబు ఈనెల 14న నూజివీడు వస్తున్నారు. ఈలోపే ఈ వివాదాన్ని సర్దుబాటు చేయాలని యోచిస్తున్నారు.
పార్టీ కార్యాలయానికి రావాలని పిలుపు
నూజివీడు నియోజకవర్గంలో పార్టీ పదవులకు రాజీనామాలు చేసినవారు, నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు, ఇతర ముఖ్య స్థానిక నేతలు గురువారం ఉదయం 10 గంటలకు విజయవాడలోని జిల్లా పార్టీ కార్యాలయానికి రావాలని పిలుపులు అందాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు నుంచి ఫోన్‌ వచ్చిందని ముద్దరబోయిన పేర్కొన్నారు. దీంతో గురువారం అందరూ జిల్లా పార్టీ కార్యాలయానికి వెళ్లటానికి సమాయత్తమవుతున్నారు. పార్టీ నిబంధనల ప్రకారం ప్రతినెలా 12వ తేదీన జరిగే రాష్ట్రస్థాయి సమీక్షా సమావేశం కూడా గురువారం విజయవాడలో జరగనుంది. ఈ సమావేశంలో నూజివీడు నియోజకవర్గానికి సంబంధించిన ఈ అంశంపై చర్చకు రాకముందే జిల్లా పార్టీ కార్యాలయంలో వీరిని బుజ్జగించి, వివాదాన్ని సమసిపోయేలా చేయటానికి పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారు.