పిడికిడంత నడుముతో నాజూకుతనానికి నిలువెత్తు నిదర్శనంగా ఉంటుంది దిశా పటాని. సినిమాల్లోకి అడుగుపెట్టి మూడు సంవత్సరాలు గడిచినా, ఇప్పటికీ ఆచితూచి సినిమాలు చేస్తోంది. తన నటనతో, అందంతో తోటివారికి ఎప్పటికప్పుడు కొత్త సవాళ్ళను విసురుతున్నా, తనకెవరూ పోటీ కాదనీ, తానెవరికి పోటీకాదని అంటున్న దిశా పటానితో….
‘లోఫర్‌’ తరువాత తెలుగులో సినిమాలు చేయకపోవడడానికి కారణం?
తెలుగులో నామొదటి సినిమా అది. ఆ సినిమా ఫలితం నాకు నిరాశను మిగిల్చిన మాట వాస్తవమే. మరో సినిమా చేద్దామనుకునేలోపు బాలీవుడ్‌లో అవకాశాలు వచ్చాయి. దాంతో తెలుగులో చేసే అవకాశం రాలేదు. త్వరలోనే ఓ తెలుగు సినిమా చేసే అవకాశముంది.
హాలీవుడ్‌లో మరో సినిమా చేసే ఉద్దేశముందా?
లేదు. అక్కడ సినిమా చేయాలంటే చాలాడేట్లు ఇవ్వాల్సి ఉంటుంది. నా కెరీర్‌ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ఇలాంటి సమయంలో ఒకసినిమా కోసం అన్ని డేట్లు ఇవ్వడం సరికాదనిపించింది. అందుకే ఇప్పుడప్పుడే మరో హాలీవుడ్‌ సినిమా చేయను. మరికొన్ని సంవత్సరాల తరువాత దానిగురించి ఆలోచిస్తాను.
ఈ రంగంలో రోజుకొక కొత్త హీరోయిన్‌ వస్తున్నారు కదా? ఆ పోటీని ఎలా తట్టుకోగలుగుతున్నారు?
పోటీ అనే పదమే నాకు నచ్చదు. నేను వేరొకరిని పోటీగా అనుకోను. వేరొకరు నన్నుపోటీగా భావించడం నాకు నచ్చదు. ఇక్కడ ఎవరి అవకాశాలు వారివి. ఒకరితో ఒకరిని పోల్చడానికి ఉండదు. ప్రేక్షకుల చేతా, నాఅభిమానుల చేతా దిశా మంచినటి అనిపించుకోవడమే నాకు ఇష్టం. నా సినిమాకు వచ్చేటప్పుడు ఎంత హ్యాపీగా వస్తారో, తిరిగి వెళ్ళేటప్పుడు కూడా అంతే హ్యాపీగా వెళ్ళాలి నేను కోరుకునేది అదే! ప్రేక్షకుల కోసం, నా అభిమానుల కోసం ఎంత కష్టపడమన్నా పడతాను. వారి కోసం ఏం చెయ్యడానికైనా రెడీగా ఉంటాను.
సినిమా ట్రయలర్లలో హీరోలకిచ్చిన ప్రాధాన్యత హీరోయిన్లకు ఇవ్వరెందుచేత?
సినిమా ట్రయిలర్‌ అంటే ఆసినిమా గురించి ఒక అవగాహన కలిగించడానికే తప్ప సినిమా మొత్తం చెప్పడానికికాదు. అలాంటప్పుడు హీరోయన్లను, ఇతర ఆర్టిస్టులను కూడా చూపించేస్తే అది ట్రయిలర్‌గా ఉండదు. అయినా అన్నీ సన్నివేశాలూ, కధా ముందే చూసేస్తే చివరికి సినిమా చూడడానికి ఏం ఉండదు. నా వరకూ సినిమా ట్రయిలర్లలో నన్ను చూపించకపోయినా పెద్దగా బాధపడను.
యాక్షన్‌ సినిమాలిష్టమా? రొమాంటిక్‌ సినిమాలిష్టమా?
నా వరకూ యాక్షన్‌ సినిమాలంటేనే ఎక్కువ ఇష్టం. అవి ఎక్కువగా హీరోయిన్‌ ఓరియెంటెడ్‌వే అయ్యుంటాయి. నా వయస్సులో అవి ఇప్పుడే చేయలేను. దానికి ఇంకా సమయముంది. ఇక నాకున్న రెండో ఛాయిస్‌ రొమాంటిక్‌ సినిమాలు. యూత్‌ని ఆకర్షించాలంటే అలాంటి సినిమాలే చేయాలి. రిపీటెడ్‌ ఆడియన్స్‌ వారే ఉంటారు కనుక, అలాంటి సినిమాలనే ఎక్కువగా చేస్తున్నాను. హర్రర్‌ సినిమాలన్నా ఇష్టమే! జనాల్ని భయపెట్టాలని అనుకుంటూ ఉంటాను. ఇంత వరకూ ఆ అవకాశం నాకు రాలేదు.
మీరన్న లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలు ఎక్కువగా రాకపోవడానికి కారణం?
స్త్రీలనగానే యాక్షన్‌ సన్నివేశాలకు పనికిరారు అన్న అభిప్రాయం మనలో చాలామందిలో ఉంది. ఈ కారణంగానే అలాంటి సినిమాలు చాలాతక్కువగా వస్తున్నాయని నా అభిప్రాయం. హీరోలతో సమానంగా ఫైట్లు చేయగల సత్తా అమ్మాయిలకూ ఉంది. అవకాశం ఇస్తేనే కదా….వారు చేసేది చెయ్యనిది తెలిసేది.
అంతా సీరియస్‌ పాత్రలేనా…లేకపోతే కామెడీ ఇష్టంలేదా?
కామెడీ అంటే నాకు చాలా ఇష్టం. కామెడీ బాగా పండించగలను అన్న నమ్మకం నాకుంది. కాకపోతే ఆ నమ్మకం నా దర్శకనిర్మాతలకు ఉంటే నాకు అలాంటి పాత్రలిస్తారు. ఇప్పటి వరకూ నా దగ్గరకు అలాంటి పాత్రలు రాలేదు. వస్తే తప్పకుండా చేస్తాను. ప్రేక్షకులను హ్యాపీగా నవ్విస్తాను.
మీలో తిరుగుబాటు ధోరణి ఎక్కువ అంటారు ఎంత వరకు నిజం?
నా తత్వమే అంత. ఏదైనా సాధించాలనుకుంటే అది  సాధించేవరకూ నిద్రపోను. పట్టుదల ఎక్కువ. అనుకున్నది సాధించే క్రమంలో కొన్నిసార్లు కొందరితో ఫైటింగ్‌ చేస్తాను. దాన్నే తిరుగుబాటు అంటారు.
మీరు అనుకున్నది సాధించానని అనుకుంటున్నారా?
ఏ వృత్తిలోనూ నూటికి నూరుశాతాన్ని ఎవరూ సాధించలేరు. ఈ విషయంలో నాకేమీ మినహాయింపు లేదు. ఈ రంగానికి వచ్చి మూడు సంవత్సరాలే అవుతోంది. మరో ముప్ఫై సంవత్సరాలైనా, నేను సాధించాల్సింది ఎంతో కొంత మిగిలే ఉంటుంది. దానికి అంతు లేదు. మా బ్రదర్‌ ఆర్మీలో కెప్టెన్‌గా ఉన్నారు నా జీవితకాలం మొత్తంలో తాను సాధించినదానిలో పదిశాతం కూడా సాధిస్తానన్న నమ్మకం నాకు లేదు. కష్టపడి పనిచేయడం ఒక్కటే నాకు తెలుసు. ఫలితం కోసం ఎప్పుడూ ఎదురు చూడను. మనం కష్టపడితే ఫలితం తప్పకుండా బాగుంటుందని నమ్మే వ్యక్తిని. నా నమ్మకం ఇప్పటి వరకూ వమ్ము కాలేదు.
ఈ రంగంలోకి వచ్చిన తరువాత మరిచిపోలేని అనుభవం?
సినిమాల పరంగా కాదుకానీ, ఓ అభిమాని అభిమానం ఎప్పటికీ నాకు గుర్తుండిపోతుంది. అహ్మదాబాద్‌కు చెందిన ఓ అమ్మాయి నన్ను చూడడానికి తన తల్లిదండ్రులతో కలిసి ముంబాయి వచ్చింది. నేనే తనకు రోల్‌మోడల్ని అంది. మోడలింగ్‌లోకి ఎలా ప్రవేశించాలి? ఎలా రాణించాలి? అనే విషయాలు అడిగి తెలుసుకుంది. తనతో గడిపిన సమయాన్ని ఇప్పటికీ మరిచిపోలేను. ట్విటర్‌ద్వారా, నేరుగా చాలా మంది నన్ను కలుస్తుంటారు కానీ, ఈ అమ్మాయి మాత్రం బాగా గుర్తుండిపోయింది.
మీ దృష్టిలో ఫ్యాషన్‌ అంటే….
లేటెస్ట్‌ ట్రెండ్‌లు ధరిస్తేనే ఫ్యాషన్‌ అని నేనుకోను. మనకు సౌకర్యంగా ఉండే దుస్తులు వేసుకోవాలి. హీరోయిన్లు వేసుకున్నారు కనుక మనమూ వేసుకుందామని అనుకోకూడదు. బయట నాకు సౌకర్యంగా ఉండే డ్రస్సులే వేసుకుంటాను. సినిమాల్లో అలా కుదరదు.
మీమీదొచ్చే గాసిప్పుల గురించి….
వాటి గురించి పట్టించుకోవడం ఎప్పుడో మానేశాను. టైగర్‌ ష్రాఫ్‌ నేనూ ప్రేమించుకున్నామన్నారు. కొన్నిరోజులు సహజీవనం చేశామన్నారు. రకరకాలుగా వార్తలు సృష్టించారు. సినిమా పరంగా తనతో కొంత చనువుగా ఉండాల్సి వచ్చింది. అలాగే కలిసి ప్రమోషన్లలో పాల్గొనాల్సి వచ్చింది. అంత మాత్రాన ప్రేమా, దోమా అంటేఎలా? అలా అనుకుంటే నేను చేసిన ప్రతి హీరోతోనూ డేటింగ్‌ చేయాల్సి వస్తుంది. అది సాధ్యమేనా?వీటి గురించి నేనే కాదు, మా ఫ్యామిలీ కూడా పట్టించుకోదు.
మీరు చాలా సిగ్గరి అంటారు నిజమేనా?
మొదట్లో కెమెరా ముందు నటించడానికి చాలాఇబ్బంది పడేదాన్ని. నటనలో ట్రైనింగ్‌ తీసుకున్నా ఆ సిగ్గు నాకు పోలేదు. ఇప్పటికీ కొన్ని సన్నివేశాలలో నటించాలంటే చాలా సిగ్గుపడుతుంటాను. హీరోయిన్లు అన్నీ వదిలేస్తారంటారు కానీ అదినిజం కాదు. మా ఫీలింగ్స్‌ మాకు ఉంటాయి. అవి ఎన్నిరోజులైనా మారవు.
నటి కావాలన్నది మీ చిన్ననాటి కలనా? లేక మధ్యలో వచ్చిన ఆలోచనా?
మా ఫ్యామిలిలో ఎవరూ ఈ రంగంలో లేరు. మా ఫాదర్‌ ఏసిపి. మా బ్రదర్‌ ఆర్మీ, నేను ఎయిర్‌ఫోర్స్‌ పైలట్‌ కావాలనుకున్నాను. చదువుకుంటున్న సమయంలో మోడలింగ్‌, నటన మీదా ఆసక్తి కలిగింది. పైలట్‌ కావాలనుకున్నదాన్ని నటిని అయ్యాను.
మీ పేరెంట్స్‌ దగ్గర్నుంచి అభ్యంతరాలు రాలేదా?
అభ్యంతరాలు కాదు కానీ, కొద్దిగా కన్‌ఫ్యూజ్‌ అయ్యారు. వారికి ఈ రంగం కొత్త. నిలదొక్కుకోగలనో లేదో అని అనుమానపడ్డారు. ఈ రంగంలో నా సక్సెస్‌ చూసి ఇప్పుడు సంతోషిస్తున్నారు.
బాలీవుడ్‌లో మీ రోల్‌మోడల్‌?
ప్రియాంకాచోప్రా. తనంటే నాకు చాలా‍ఇష్టం. చదువుకునే రోజుల్నించి తనకు నేను అభిమానిని. తనని చూసే నేను సినిమాల్లోకి వచ్చాను.
ప్రియాంక తరువాత ఈ రంగంలో మీరు ఎక్కువగా ఇష్టపడే వ్యక్తులు?
నాకు స్నేహితులు తక్కువ. నిద్రలేవగానే జిమ్‌కెళ్ళడం, ఆ తరువాత రెడీ అయి షూటింగ్‌, షూటింగ్‌ నుంచి ఇంటికొచ్చిన తరువాత ఫ్యామిలీతో రిలాక్స్‌ కావడం ఇదే నా దినచర్య. స్నేహితులను కలుసుకోవడం, వారితో కలిసి పార్టీలకు, పబ్‌లకూ వెళ్ళడం అంటూ ఉండదు. నాతోటి వారు ఎక్కడ కనిపించినా మాట్లాడతాను. అంతవరకే వారితో నా స్నేహం.