న్యూఢిల్లీ: అక్రమ సంబంధం శిక్షార్హమైన నేరమే అని కేంద్రం స్పష్టం చేసింది. వివాహ వ్యవస్థ పవిత్రను కాపాడేందుకు ఆ శిక్ష అవసరమే అని సుప్రీంకోర్టుకు తెలిపింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తినే కాకుండా మహిళకు కూడా శిక్షను విధించాలంటూ దాఖలైన పిటీషన్‌పై సుప్రీంకోర్టు తన వాదనలను వినిపించనున్నది. అయితే ఈ అంశంపై కేంద్రం ఓ క్లారిటీ ఇచ్చింది. ఐపీసీలోని సెక్షన్ 497, 198(2) చట్టాలను రద్దు చేస్తే భారతీయ మూలాలకు పెను విఘాతం ఏర్పడే అవకాశం ఉందని కోర్టు అభిప్రాయపడింది. దీని వల్ల భారతీయ వివాహ వ్యవస్థ ప్రాముఖ్యత కూడా తగ్గే ప్రమాదం ఉందని కేంద్రం పేర్కొన్నది. బ్రిటీష్ కాలం నాటి చట్టం ప్రకారం ఎవరైనా వ్యక్తి వివాహేతర సంబంధం పెట్టుకుంటే అతనికి అయిదేళ్ల జైలు శిక్ష వేస్తారు. దానితో పాటు జరిమానా కూడా విధిస్తారు. అడల్ట్రీ పిటీషన్‌పై అయిదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పును వెలువరించనున్నది. వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ బాధితురాలు కాదు అని, ఆమె కూడా నేరస్తురాలే అని పిటీషన్‌లో పేర్కొన్నారు.