తమిళ నటుడు కమల్ హాసన్ స్థాపించిన ‘మక్కళ్ నీది మయ్యమ్ (ఎంఎన్ఎం)’ పార్టీకి విపరీతమయిన ఆదరణ లభిస్తోంది. పార్టీ వెబ్‌సైటును ప్రారంభించిన 48 గంటల్లోనే సభ్యత్వ నమోదుకు అనూహ్య స్పందన లభించింది. ఆన్‌లైన్‌లో దాదాపు రెండు లక్షల మందికి పైగా పార్టీలో చేరారని పార్టీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ వివరాలను ఆయన బుధవారం వెల్లడించారు.  భారత్‌తో పాటు అమెరికా, యూఏఈ, సింగపూర్, యూకే, మలేసియా, సౌదీ అరేబియా, కెనడా లాంటి దేశాల నుంచి కూడా పార్టీ వెబ్‌సైట్ ద్వారా పార్టీలో సభ్యత్వం తీసుకున్నారని ఆయన చెప్పారు. కాగా, ఈ నెల 21న మధురైలో కమల్ తన రాజకీయ పార్టీని లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. అదే రోజు రాత్రి 7.27 గంటలకు ఈ వెబ్‌సైటును ప్రారంభించారు. అయితే తాజాగా సభ్యత్వం తీసుకున్న వారిలో తమిళనాడు రాష్ట్రంలో ఓటు హక్కు ఎంత మందికి ఉందన్న సంగతి మాత్రం తెలియడం లేదు.