ఆంధ్రప్రదేశ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎస్సై) పరీక్షలు రాసి, ఎంతో కాలంగా ఫలితాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది అభ్యర్థుల కల ఫలించింది. ఈ ఉదయం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, హోమ్ మంత్రి మేకతోటి సుచరితలు ఎస్ఐ ఫలితాలను విడుదల చేశారు. దీంతో నెలల తరబడి రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. తామంతా ఎంతో కాలంగా ఈ క్షణం కోసం వేచి చూస్తున్నామని పలువురు వ్యాఖ్యానించారు. త్వరలోనే ఇంటర్వ్యూల షెడ్యూల్ ను విడుదల చేస్తామని ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. కాగా, ఈ కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, ఇంటిలిజెన్స్‌ చీఫ్‌ కుమార్‌ విశ్వజిత్‌ తదితరులు పాల్గొన్నారు.