టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు బీజేపీలో చేరికకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇటీవల ఆయన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌తో సమావేశం కావడం ఈ ఊహాగానాలకు ఊతమిస్తోంది. ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న టీడీపీకి రాయపాటి గుడ్ బై చెప్పబోతున్నారన్న ప్రచారం నేపథ్యంలో బుధవారం ఆయన స్పందించారు. బీజేపీ నేతలు తనను పార్టీలోకి ఆహ్వానించిన మాట వాస్తవమేనన్నారు. అయితే, తాను మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.ఇటీవల గుంటూరు వచ్చిన రాంమాధవ్‌ను తన ఇంటికి ఆహ్వానించానని, ఈ సందర్భంగా ఆయన తనను పార్టీలోకి ఆహ్వానించారని తెలిపారు. తనను బీజేపీ నేతలు ఆహ్వానించిన విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. వచ్చేవారం ఢిల్లీలో బీజేపీ పెద్దలతో సమావేశం కానున్నట్టు చెప్పిన రాయపాటి.. ఆ తర్వాతే పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకుంటానని వివరించారు. మరోవైపు, ఆయన కుమారుడు రంగారావు మాత్రం తాను టీడీపీని వీడేది లేదని తేల్చి చెప్పారు.