బెంగళూరు: కర్ణాటకలోని చిక్కబళ్లాపుర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు బస్సు, టాటా ఏస్​ ఢీకొని 12మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన పోలీసులు వారికి చికిత్స అందిస్తున్నారు. ఓ ప్రైవేటు బస్‌ చింతమణి నుంచి బెంగళూరుకు వెళ్తోంది. మరోవైపు, టాటా మ్యాజిక్ మురుగమళ్ల నుంచి చింతమణికి ప్రయాణిస్తోంది. ఈ రెండు వాహనాలు చిక్కబళ్లాపుర్‌ మీదుగా వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఈ ప్రమాదంలో గాయాలపాలైన కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రైవేటు బస్సు అతి వేగంగా ప్రయాణిస్తుండడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారంతా మురుగముళ్ల ప్రాంతానికి చెందిన వారని సమాచారం. ఈ ప్రమాదం జరిగిన అనంతరం బస్సు డ్రైవర్‌ అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.