ఒక వైపున తెలుగు .. తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోన్న తమన్నా, హిందీలోను తన జోరును కొనసాగించడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది. బాలీవుడ్ పై భారీగా ఫోకస్ పెట్టిన కారణంగా ఆమెకి ‘హిమ్మత్ వాలా’ .. ‘హమ్ షకల్స్’ .. ‘ఎంటర్టైన్మెంట్’ చిత్రాలు దక్కాయి. అయితే ఈ సినిమాలు ఆమెకి అక్కడ గుర్తింపు మాత్రమే తీసుకురాగలిగాయి.
అప్పటి నుంచి కూడా ఆమె సరైన హిట్ కోసం ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమెకి నవాజుద్దీన్ సిద్ధిఖీ సరసన అవకాశం లభించింది. నవాజుద్దీన్ కథానాయకుడిగా షామాన్ సిద్ధిఖీ ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా ముందుగా ఆయన మౌనీ రాయ్ ను ఎంపిక చేసుకున్నాడు. అయితే కొన్ని కారణాల వలన ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో, తమన్నాను తీసుకున్నాడు. ఈ ప్రాజెక్టులో ఛాన్స్ దక్కడం పట్ల తమన్నా ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. కథాకథనాలు తనకి బాగా నచ్చాయనీ, సెట్లోకి ఎప్పుడు అడుగుపెడతానా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఆమె చెప్పుకొచ్చింది.