• చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయమిది
  • గెలుపునకు కారణం నేతలు, నాయకులు, కార్యకర్తలు
  • దేశం మొత్తం మన పాలన వైపు చూసేలా పని చేస్తా

ఏపీలో వైసీపీ సాధించిన భారీ మెజార్టీ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయమని, ఇది తన ఒక్కడి విజయం కాదని, పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు కలిసి సాధించిన గెలుపు అని వైసీపీ అధినేత జగన్ అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో వైఎస్సార్ ఎల్పీ నేతగా ఆయన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం, జగన్ మాట్లాడుతూ, ఈ విజయానికి కారణం తనతో పాటు కష్టపడ్డ నేతలు, నాయకులు, కార్యకర్తలు అని అన్నారు. ప్రతి గ్రామంలోని కార్యకర్త తనకు తోడుగా ఉండటంతోనే ఈ విజయం సాధ్యమైందని చెప్పారు. ప్రజలకు ఏరకమైన కష్టాలు వచ్చినా అండగా నిలిచిందని వైసీపీయేనని అన్నారు. దేశం మొత్తం మన పాలన వైపు చూసేలా పని చేస్తామని, సుపరిపాలనకు మీ అందరి సహాయసహకారాలు కావాలని కోరారు. ఈ సందర్భంగా తనను శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నుకున్న ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలియజేశారు.