దిల్లీ: దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ వచ్చే ఏడాది నుంచి డీజిల్ వేరియంట్ లో కార్ల ఉత్పత్తిని నిలిపివేయనుంది. 2020 ఏప్రిల్ 1 నుంచి తమ అన్ని మోడళ్లలో డీజిల్ కార్లను అమ్మబోమని మారుతీ సుజుకీ ఇండియా ఛైర్మన్ ఆర్ సీ భార్గవ గురువారం వెల్లడించారు. ప్రస్తుతం దేశీయంగా ఈ సంస్థ అమ్మకాలు జరుపుతున్న కార్లలో దాదాపు 23 శాతం డీజిల్ కార్లే ఉండడం విశేషం.
వినియోగదారుల కోసమే..
డీజిల్ కార్ల తయారీకి ఎక్కువ ఖర్చు అవుతున్న దృష్ట్యా దీన్ని వినియోగదారులు భరించగలిగే వరకూ ఈ తరహా కార్ల ఉత్పత్తి చేస్తామని గతంలో మారుతీ ప్రకటించింది. కానీ వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి బీఎస్ -6 తరహా వాహనాలు అరంగేట్రం చేయనున్నాయి. ఈ సాంకేతికతతో డీజిల్ వేరియంట్ లో కార్ల ఉత్పత్తి ఖర్చు బాగా పెరగనుందని భార్గవ వెల్లడించారు. బీఎస్ -6, డీజిల్ వేరియంట్ లో చిన్న కార్ల ధరలు అత్యధికంగా పెరిగే అవకాశం ఉండడంతో దీన్ని వినియోగదారులు భరించే అవకాశం ఉండనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. డీజిల్ వేరియంట్ ధరలు పెరిగితే ఏ కార్ల తయారీ సంస్థా డీజిల్ ఇంజిన్ కార్లను తయారు చేసే సాహసం చేయబోదని భార్గవ స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఎస్ -క్రాస్ , సియాజ్ , వితారా బ్రెజ్జా, డిజైర్ , బాలెనో, స్విఫ్ట్ మోడళ్లు డీజిల్ వేరియంట్ లోనూ లభిస్తున్నాయి. అయితే బాగా ఖరీదైన కార్ల విషయంలో డీజిల్ వేరియంట్ ను కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.