విజయవాడ: పండగలొస్తే చాలు అటు ఆర్టీసీ, ఇటు రైల్వేలు టికెట్ ధరలు పెంచేసి సామాన్యులను బాదేస్తున్నాయి. నిన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఫ్లాట్ ఫాం టికెట్ ధరలను పెంచగా.. నేడు విజయవాడ రైల్వే స్టేషన్లో పెంచేశారు.ప్రస్తుతం రూ.10లుగా ఉన్న ప్లాట్ ఫాం టిక్కెట్‌ ధరను రూ.20లకు పెంచుతున్నట్టు గురువారం రైల్వే అధికారులు వెల్లడించారు. పెంచిన ఈ ధరలు సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్‌ 4 వరకు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు.రైల్వే స్టేషన్లలో రద్దీని తగ్గించేందుకే తాము ఫ్లాట్ ఫాం టికెట్ ధరలను పెంచామని రైల్వే అధికారులు చెబుతుండటం గమనార్హం. పండగల సందర్భాల్లో రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడటం తెలిసిన విషయమే. ప్రయాణికులు తప్ప మరెవరూ రాకూడదనే ఉద్దేశంతోనే ఈ టికెట్ ధరలను పెంచినట్లు చెబుతున్నారు.