న్యూఢిల్లీ: రిలయన్స్‌ జియోఫోన్ల డెలివరీ ఈ ఆదివారం నుంచి ప్రారంభంకానున్నట్టు తెలుస్తోంది. తొలి విడతలో బుకింగ్‌ అయిన 60 లక్షల ఫోన్లను 15 రోజుల వ్యవధిలోనే డెలివరీ చే సే విధంగా రిలయన్స్‌ సన్నాహాలు చేసినట్టు రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ చానల్‌ పార్ట్‌నర్‌ ఒకరు తెలిపారు. మొదటగా గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో జియోఫోన్ల డెలివరీ ఉంటుందని, తర్వాత పట్టణాల్లో మొదలవుతుందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఆ పార్ట్‌నర్‌ చెప్పారు. అయితే విషయంపై ఇప్పటి వరకు రిలయన్స్‌ జియో ఎలాంటి ప్రకటన చేయలేదు. జియోఫోన్ల ప్రీ బుకింగ్స్‌ గత నెల 24న ప్రారంభమైన విషయం తెలిసిందే. 500 రూపాయలు (ఫోన్‌ ధర రూ.1,500) చెల్లించి ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌ స్టోర్లలో ఈ ఫోన్‌ను బుకింగ్‌ చేసుకునే సదుపాయం కల్పించారు. డెలివరీ సందర్భంగా మిగతా 1,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుం ది. దాదాపు 60 లక్షల ఫోన్ల బుకింగ్స్‌ జరగడంతో వీటి బుకింగ్స్‌ను జియో నిలిపివేసింది. మళ్లీ ఎప్పుడు బుకింగ్స్‌ ప్రా రంభించే విషయాన్ని రిలయన్స్‌ జియో ప్రకటించలేదు.