లండన్ : భూమి గ్రహంగా ఏర్పడిన తర్వాత ప్రస్తుత రూపానికి మారే క్రమంలో 40 శాతం బరువును కోల్పోయిందని బ్రిటన్ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. బ్రిస్టల్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఏండ్లపాటు గ్రహాల ఆవిర్భావంపై పరిశోధనలు జరిపి కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. సూర్యుడి చుట్టూ తిరుగుతున్న అంతరిక్ష పదార్థాలు ఒకదానితో ఒకటి కలిసిపోవడం ద్వారా గ్రహాలు ఏర్పడ్డాయనే భావన ఉన్నది. అయితే ప్రస్తుత రూపానికి మారే క్రమంలో ఏ మార్పులు జరుగుతాయో కచ్చితమైన ఆధారాలు లేవు. లండన్ శాస్త్రవేత్తల ప్రకారం.. గ్రహాలు ఏర్పడే సమయంలో అత్యధిక బరువున్న పదార్థాలు వేగంగా ఒకదానితో ఒకటి ఢీకొట్టుకుంటాయి. దీంతో వాటి స్వరూపాలు, రసాయన స్థితిగతులు మారుతుంటాయి. ఫలితంగా పర్వతాలు, లోయలు, పీఠభూములు ఏర్పడుతుంటాయి. ఈ క్రమంలో ఉత్పత్తి అయిన వేడి, అంతర్గతంగా రసాయన చర్యలు జరిగినప్పుడు విడుదలైన ఉష్ణం వాతావరణం ద్వారా అంతరిక్షంలోకి వెళ్లిపోతుంది. ఈ ప్రక్రియ కొన్ని లక్షల ఏండ్లపాటు కొనసాగుతుంది. అంతేకాకుండా గ్రహాలు ప్రాథమికంగా ఏర్పడిన సమయంలో వాటి గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉంటుంది.దీంతో వాటి నుంచి కొన్ని పదార్థాలు వేరయ్యి ఉపగ్రహాలుగా మారుతుంటాయి. ఈ రెండు చర్యల కారణంగా గ్రహాలు తమ బరువును కోల్పోతుంటాయి. భూమి ప్రాథమికంగా ఏర్పడినప్పటితో పోల్చితే 40 శాతం బరువును కోల్పోయి ఇప్పుడున్న రూపానికి చేరిందని పరిశోధక బృంద సభ్యుడు రెమ్కో హిన్ పేర్కొన్నారు. భూమి, అంగారక గ్రహంపై తాము గుర్తించిన మెగ్నీషియం ఐసోటోప్‌లే ఇందుకు నిదర్శనమన్నారు.సిలికేట్ అణువులు ఆవిరిగా మారడం వల్లే మెగ్నీషియం అణువులు ఐసోటోప్‌లుగా మారాయన్నారు.