త్రివిక్రమ్ .. పవన్ కల్యాణ్ .. నితిన్ నిర్మాతలుగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో ‘ఛల్ మోహన్ రంగ’ సినిమా రూపొందుతోంది. త్రివిక్రమ్ అందించిన ఈ కథలో నాయికగా మేఘా ఆకాశ్ నటిస్తోంది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాను, ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిన్న రాత్రి 9 గంటలకు ఈ సినిమా నుంచి ఓ సాంగ్ ను రిలీజ్ చేశారు.
‘రంగా .. రంగా .. రంగా .. చిందేయి సామి రంగా ..  శివమెత్తు సుబ్బరంగా .. ఛల్ మోహన్ రంగ’ అంటూ మాంచి జోరుగా ఈ సాంగ్ కొనసాగుతోంది. తెలంగాణలో బాగా పాప్యులర్ అయినా ‘నువు పెద్దపులి .. నువ్వు పెద్దపులి’ సాంగ్ తరహాలో ఈ బీట్ దుమ్మురేపేస్తోంది. బోనాల జాతర సందర్భంలో వచ్చే పాటగా దీనిని చిత్రీకరించారు. తమన్ కూర్చిన ఈ ఊరమాస్ బాణీకి ఒక రేంజ్ లో రెస్పాన్స్ వస్తోంది. మాస్ ఆడియన్స్ నుంచి ఈ సాంగ్ వీలైనన్ని విజిల్స్ ను వసూలు చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.