దివంగత సినీ నటి శ్రీదేవి అంత్యక్రియల అనంతరం కపూర్‌, అయ్యప్పన్‌, మార్వా కుటుంబసభ్యులు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో గత నాలుగు రోజులుగా మీడియాలో ప్రముఖంగా ప్రసారమైనవి శ్రీదేవి వార్తలేనని అన్నారు. ఏకాంతంగా కూర్చుని ఆ బాధను అనుభవించడానికి తమకు అవకాశం ఇవ్వాలని, మీడియా తమకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
శ్రీదేవి జీవితాంతం గౌరవంగా బతికారని గుర్తుచేసిన బంధువులు, ఇకపై కూడా అదే గౌరవాన్ని కొనసాగించాలని కోరారు. గత కొన్ని రోజులుగా తాము విషమ పరీక్షను ఎదుర్కొన్నామని, తాము ప్రశాంతంగా దుఃఖించేందుకు అవకాశమివ్వాలని అడిగారు. శ్రీదేవి ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. కష్టకాలంలో అండగా నిలిచిన శ్రీదేవి స్నేహితులు, తోటి నటులు, వెలకట్టలేని అభిమానులు, దేశం, ప్రపంచం, మీడియా ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.జాన్వి, ఖుషీకి కుటుంబం ఎప్పటికీ చేదోడువాదోడుగా ఉంటుందని తెలిపారు. ఇంతవరకు శ్రీదేవిపై చూపిన ప్రేమ వారిపై కూడా కురిపించి, వారిని తల్లిలేని బాధ నుంచి కోలుకునేలా చేద్దామని, వారికి అండగా నిలిచి శ్రీదేవి కలలు కన్న భవిష్యత్ ను వారికి అందిద్దామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.