ముంబై: మార్ట్‌గేజ్‌ రుణ గ్రహీతలకు ఐసీఐసీఐ బ్యాంకు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. వారు తీసుకున్న ఇంటి రుణాన్ని తిరిగి చెల్లించడం ద్వారా ఒక శాతం క్యాష్‌ బ్యాక్‌ పొందొచ్చు. ప్రతి నెలా వాయిదా చెల్లించిన వెంటనే ఒక శాతాన్ని బ్యాంకు వెనక్కిస్తుంది. రుణాలకు డిమాండ్‌ తగ్గడం, అధిక నిధుల లభ్యత వల్ల రుణగ్రహీతలను ప్రోత్సహించేందుకు ఐసీఐసీఐ బ్యాంకు ఈ ఆఫర్‌ను తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. 30 ఏళ్ల రుణ కాల వ్యవధిలో ఈ విధంగా రుణ గ్రహీత అసలులో 11 శాతం వరకు క్యాష్‌ బ్యాక్‌గా పొందొచ్చు.ఈ అవకాశం కొత్తగా రుణం తీసుకునేవారికే!!. ఇదే విధంగా బ్యాంకు మరో రెండు పథకాలను కూడా ప్రకటించింది. డెబిట్, క్రెడిట్‌ కార్డుల వినియోగంపై 20 శాతం క్యాష్‌ బ్యాక్‌ను ఇవ్వనున్నట్టు తెలిపింది. గరిష్టంగా రూ.10,000 వరకే క్యాష్‌ బ్యాక్‌ను పరిమితం చేసింది. దేశీయంగా రుణాల వృద్ధి 2016–17లో 5.08 శాతంగా నమోదు అయిన విషయం తెలిసిందే. 1953 తర్వాత ఇంత తక్కువ వృద్ధి నమోదైంది గతేడాదే. ఇటీవలే యాక్సిస్‌ బ్యాంకు సైతం రుణ చెల్లింపుల్లో వైఫల్యం చెందని ఖాతాదారులకు కొంత మేర ఈఎంఐలను ఎత్తేయనున్నట్టు ప్రకటించింది. తీసుకున్న రుణాన్ని సక్రమంగా చెల్లించే దిశగా వారిని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.